shorte links

Sunday, July 31, 2016

‘డిజైన్’ను కేసీఆర్ రిజెక్ట్ చేశారు


ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయనకు నచ్చినట్లుగా డిజైన్లు రూపొందించటం అంత తేలికైన విషయం కాదు. కొత్త కొత్త కట్టడాల మీద ఆసక్తి ప్రదర్శిస్తూ.. ఓ పక్క సచివాలయాన్ని.. మరోపక్క అసెంబ్లీ భవనాల్ని కొత్తగా నిర్మించాలని తపిస్తున్న కేసీఆర్ దృష్టి ప్రస్తుతం సచివాలయం మీద పడింది. ఇప్పుడున్న సచివాలయాన్ని మొత్తంగా నేలమట్టం చేసి.. అత్యద్భుతమైన రీతిలో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన డిజైన్లు కేసీఆర్ పరిశీలనకు వచ్చాయి. మీడియాకు రిలీజ్ చేసిన ఈ బొమ్మలపై కేసీఆర్ దృష్టి సారించారు. బాగున్నాయన్న భావన కలిగించిన ఈ డిజైన్లను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రిజెక్ట్ చేశారు.

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్ బ్లాక్.. నార్త్ బ్లాక్ భవన నమూనాలతో సిద్ధం చేసిన తెలంగాణ సెక్రటేరియట్ డిజైన్ కేసీఆర్ మనసును దోచుకోలేదు. డిజైన్ లోని లోపాల్ని ఎత్తి చూపిన కేసీఆర్.. సచివాలయానికి అవసరమైన ‘తెలంగాణ’ మార్క్ లేదని ఎత్తి చూపారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా డిజైన్ లేకపోవటం.. వాస్తు పరంగా కొన్ని లోపాలు ఉండటతో.. కొత్త డిజైన్లు రిజెక్ట్ చేసి వేరేవి సిద్ధం చేయాలని ఆదేశించారట.

సచివాలయం కోసం సిద్ధం చేసిన నమూనాలలో.. కేసీఆర్ కు ఇష్టమైన భారీ గుమ్మటాలు లేకపోవటం కూడా.. డిజైన్ ను రిజెక్ట్ చేయటానికి ఒక కారణమన్న భావన కూడా వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ డిజైన్ ను చూస్తే.. భారీ గుమ్మటాలు కనిపిస్తాయి. అదే కాదు.. ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యురిటీ కార్యాలయ నమూనా కూడా భారీ గుమ్మటాలతో ఉండటాన్ని చూడొచ్చు. ఈ లోపాలతో పాటు.. సీఎం కూర్చునే సీఎంవోను నైరుతి దిశలో ఉండేలా చూడాలని.. సీఎం కార్యాలయం మిగిలిన వాటి కంటే ఎత్తులో ఉండటం.. ఈ భవనంపై భాగంలో భారీ గుమ్మటం ఏర్పాటు చేయాలన్న సూచన కూడా చేసినట్లుగా చెబుతున్నారు. సచివాలయ నమూనాను కేసీఆర్ తిరస్కరించటంతో కొత్త డిజైన్లను మళ్లీ రూపొందించాల్సిన అవసరం ఉంది. సో.. రానున్న రోజుల్లో మరిన్ని నమూనాలు కలర్ ఫుల్ గా మీడియాలో కనిపించనున్నాయన్న మాట.

1 comment: