shorte links

Sunday, July 31, 2016

ఢిల్లీకి వెళ్లను.. మోడీని కలవను

పిడికిలి బిగించి ఉంటే.. లోపల ఏం లేకున్నా ఏదో ఉందన్న భావన కలుగుతుంది. అదే గుప్పిటను తెరిచేస్తే.. గుట్టు రట్టవుతుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు సైతం ఇలానే ఉంది. ప్రత్యేకహోదా మీద ఇప్పటికి పాతికసార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పుకునే చంద్రబాబు.. ఈ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు చాలా పనులు ఉన్నాయని.. ఆ పని తమ ఎంపీలు చేస్తారని చెప్పుకొచ్చారు.

ఇదే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో వారానికి ఒక రోజు ఢిల్లీకి కేటాయిస్తానని.. జాతీయ రాజకీయాలు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి ఫాలో అప్ చేసేందుకు తాను వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ.. మోడీ నుంచి ఇందుకు స్పందన లేకపోవటం.. ప్రతి దానికి మీరు ఢిల్లీకి రావటం ఏమిటన్న మోడీ అసంతృప్తితో పాటు.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చే వాడినే కానని.. తన రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ నేతలు.. అధికారులతో పూర్తి చేసేవాడినంటూ బాబుతో చెప్పినట్లుగా చెబుతారు.

బాబుతో మోడీ అన్న ఈ మాటల సారాంశం ఏమిటో ప్రత్యేకంగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఢిల్లీకి రావొద్దు. మీ స్టేట్ లొ కూర్చొని మీ పని మీరు చేసుకోవచ్చుగా?’ అని చెప్పటమే. మోడీ మాటల్లో సందేశాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లే మాటను చెప్పటం తగ్గించేశారు. ఇక.. మోడీతో తనకు పెరుగుతున్న దూరం.. తనకిస్తున్న మర్యాద ఎంతన్నది అర్థం చేసుకున్న చంద్రబాబు.. తరచూ ఢిల్లీకి వెళ్లే తీరును తగ్గించుకున్నారు. మొన్నామధ్యన ప్రధాని మోడీతో ముఖ్యమంత్రుల భేటీ జరిగిన సదర్భంలోనూ.. మీటింగ్ ముగిసిన వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చారే కానీ.. గతంలో మాదిరి బాబు ఢిల్లీలోనే ఉండిపోలేదు.

తాజా విలేకరుల సమావేశంలో తాను ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని.. ప్రధాని మోడీని కలవాల్సిన అవసరం లేదని చెప్పటం ద్వారా ప్రధానితో అంత గొప్ప రిలేషన్స్ ఏమీ లేవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. తనకు రాష్ట్రంలో బోలెడన్ని పనులుఉన్నాయని చెప్పిన చంద్రబాబు.. మరి హోదా గురించి పాతికసార్లు ఢిల్లీ వెళ్లినట్లు చెబుతారు. మరి.. అప్పుడు ఆయనకు రాష్ట్రంలోపని లేదా? హోదా అంశంపై తన ఎంపీలు చూసుకుంటారన్న ఆయన మాటల్ని చూసినప్పుడు.. మరి గతంలో అదే పనిని ఎందుకు చేయలేదో? అన్న సందేహం కలగక మానదు. ఢిల్లీకి వెళ్లను.. మోడీని కలవనన్న మాటలతో ఢిల్లీలో తనకున్న పరపతి లెక్కను బాబు  చెప్పకనే చెప్పేసినట్లుగా చప్పాలి. ఇలా ఇంటి గుట్టును రట్టు చేసుకుంటే విలువ ఉండన్నవిషయాన్ని బాబు ఆలోచించటం లేదా?

‘డిజైన్’ను కేసీఆర్ రిజెక్ట్ చేశారు


ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయనకు నచ్చినట్లుగా డిజైన్లు రూపొందించటం అంత తేలికైన విషయం కాదు. కొత్త కొత్త కట్టడాల మీద ఆసక్తి ప్రదర్శిస్తూ.. ఓ పక్క సచివాలయాన్ని.. మరోపక్క అసెంబ్లీ భవనాల్ని కొత్తగా నిర్మించాలని తపిస్తున్న కేసీఆర్ దృష్టి ప్రస్తుతం సచివాలయం మీద పడింది. ఇప్పుడున్న సచివాలయాన్ని మొత్తంగా నేలమట్టం చేసి.. అత్యద్భుతమైన రీతిలో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన డిజైన్లు కేసీఆర్ పరిశీలనకు వచ్చాయి. మీడియాకు రిలీజ్ చేసిన ఈ బొమ్మలపై కేసీఆర్ దృష్టి సారించారు. బాగున్నాయన్న భావన కలిగించిన ఈ డిజైన్లను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రిజెక్ట్ చేశారు.

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్ బ్లాక్.. నార్త్ బ్లాక్ భవన నమూనాలతో సిద్ధం చేసిన తెలంగాణ సెక్రటేరియట్ డిజైన్ కేసీఆర్ మనసును దోచుకోలేదు. డిజైన్ లోని లోపాల్ని ఎత్తి చూపిన కేసీఆర్.. సచివాలయానికి అవసరమైన ‘తెలంగాణ’ మార్క్ లేదని ఎత్తి చూపారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా డిజైన్ లేకపోవటం.. వాస్తు పరంగా కొన్ని లోపాలు ఉండటతో.. కొత్త డిజైన్లు రిజెక్ట్ చేసి వేరేవి సిద్ధం చేయాలని ఆదేశించారట.

సచివాలయం కోసం సిద్ధం చేసిన నమూనాలలో.. కేసీఆర్ కు ఇష్టమైన భారీ గుమ్మటాలు లేకపోవటం కూడా.. డిజైన్ ను రిజెక్ట్ చేయటానికి ఒక కారణమన్న భావన కూడా వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ డిజైన్ ను చూస్తే.. భారీ గుమ్మటాలు కనిపిస్తాయి. అదే కాదు.. ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యురిటీ కార్యాలయ నమూనా కూడా భారీ గుమ్మటాలతో ఉండటాన్ని చూడొచ్చు. ఈ లోపాలతో పాటు.. సీఎం కూర్చునే సీఎంవోను నైరుతి దిశలో ఉండేలా చూడాలని.. సీఎం కార్యాలయం మిగిలిన వాటి కంటే ఎత్తులో ఉండటం.. ఈ భవనంపై భాగంలో భారీ గుమ్మటం ఏర్పాటు చేయాలన్న సూచన కూడా చేసినట్లుగా చెబుతున్నారు. సచివాలయ నమూనాను కేసీఆర్ తిరస్కరించటంతో కొత్త డిజైన్లను మళ్లీ రూపొందించాల్సిన అవసరం ఉంది. సో.. రానున్న రోజుల్లో మరిన్ని నమూనాలు కలర్ ఫుల్ గా మీడియాలో కనిపించనున్నాయన్న మాట.

తాలిబన్ రాజ్యంలా కాశ్మీర్ మారిందా?


తాలిబన్ల హవా నడిచే చోట పరిస్థితులు ఎంత ఆరాచకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కాశ్మీర్ లో అలాంటి పరిస్థితి ఉందా? అన్న సందేహం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు వింటే కలగటం ఖాయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అల్లర్లతో కాశ్మీర్ లో పరిస్థితులు దిగజారాయి. ఎప్పుడూ లేని కొత్త పోకడలు కొత్తగా పుట్టుకు వచ్చినట్లుగా ఆ సీఎమ్మే చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఈ మాటలు కొత్త ఆందోళనల్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం.

గత నెలలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేయటం తెలిసిందే. జులై 8న చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం కశ్మీర్ లోయ మొత్తంగా అట్టుడికిపోయింది. అల్లర్లు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో స్థానిక కాశ్మీరీ ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికంగా చెలరేగిన అల్లర్లను అదుపు చేసే క్రమంలో భద్రతా దళాలు జరుపుతున్న కాల్పులతో పరిస్థితి మరింత దిగజారుతున్న దుస్థితి.

ఇదిలా ఉంటే..  కాశ్మీర్ లో తాజాగా చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ తూటాలు.. గ్రెనేడ్లు సమస్యలకు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. '‘పదేళ్ల కుర్రాడు షాపు నిర్వాహకుల్ని కొడుతున్నాడు.. ముసుగులు ధరించిన పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. స్కూటీల్ని నడిపే అమ్మాయిల్ని తగలబెట్టేస్తామంటున్నారు. మహిళల్ని.. వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి కాశ్మీర్ నా మనం కోరుకుంది?’’ అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్ని ఆందోళనలు ఉన్నా.. కాశ్మీర్ లోయలో మహిళల పట్ల దాడులు జరగటం.. అమర్యాదకరంగా వ్యవహరించటం కనిపించదు. అలాంటి చోట.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. తాలిబన్ పోకడల్ని కొందరు వ్యాప్తి చేస్తున్నట్లు కనిపించక మానదు. అదే జరిగితే.. పెద్ద ముప్పే కాశ్మీర్ ను పొంచి ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

బాబు నిర్ణయాన్ని కేసీఆర్ ఫాలో అయ్యారు

ఈ మధ్యన వాట్సప్ లో ఒక మెసేజ్ పలువురి దృష్టిని ఆకర్షించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రుళ్ల పేర్లు మాత్రమే కాదు.. వారి పాలన కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుందని అందులో ఎలాంటి తేడా లేదంటూ ఉదాహరణలతో కూడిన ఒక పోలికతో ఉన్న పోస్టింగ్ పెట్టారు. ఇది విపరీతంగా షేర్ అయ్యింది. నిజానికి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని చెప్పాలి. చాలా సందర్భాల్లో కుడి ఎడంగా ఒకేలాంటి నిర్ణయాలు కనిపిస్తాయి.

ఇటీవల సెల్ ఫోన్ల మీద వసూలు చేస్తున్న 14.5 వ్యాట్ ను ఐదు శాతానికి తగ్గిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఏపీతో సహా పలు దక్షిణాది రాష్ట్రాలు మొబైల్స్ మీద 5 శాతం పన్ను విధిస్తే.. తెలంగాణ రాష్ట్రం మాత్రం 14.5 శాతం వ్యాట్ ను వసూలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. ఎట్టకేలకు పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన మరిన్ని నిర్ణయాలపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాలనా పరంగంలో ఇప్పటికే జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మీద దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని పెంచే నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్నారు. ఏవియేషన్ రంగానికి ప్రోత్సాహాన్ని కల్పించేలా అప్పుడెప్పుడో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

విమానాలకు వినియోగించే ఇంధనంపై వ్యాట్ ను 16 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. పెద్ద ఎత్తున విమానాలు ఏపీకి వెళుతున్న పరిస్థితి. ఫ్యూయల్ ఫిల్లింగ్ కు శంషాబాద్ లో అవకాశం ఉన్నా.. పన్నులో వచ్చే 15 శాతం వ్యత్యాసం నేపథ్యంలో ఏపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి. దీని కారణంగా.. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోల్పోతోంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదంటూ విమర్శలువచ్చినా పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తాజాగా దిద్దుబాటు చర్యల్ని చేపట్టటం తోపాటు.. ఇప్పటివరకూ 16 శాతంగా ఉన్న వ్యాట్ ను ఒక శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ నిర్ణయాన్ని గతంలోనే తీసుకోవాల్సింది. మరింత కాలం ఎందుకు పట్టించుకోలేదో కేసీఆర్ సర్కారుకే తెలియాలి.

ఆంధ్రా ‘గుండె’ తెలంగాణ ‘ప్రాణాన్ని’ నిలిపింది

నిజమే.. పెద్ద మనసుతో చేసిన ఆలోచనతోనే ఇది సాధ్యమైంది. ఆయుష్షు తీరిన మనిషికి మరో గుండె కొత్త జీవితాన్నిచ్చిన మానవీయ ఘటన ఇది. ఒక మహిళా రోగి గుండె వేదనను.. మరో కుటుంబం ఆవేదనలోనూ అర్థం చేసుకున్న వైనంతో మరో ప్రాణం నిలబడిన పరిస్థితి. తీవ్రఉత్కంఠతో పాటు.. ఎంతో మంది మనసుల్ని దోచిన ఈ ఉదంతం లోకి వెళితే..

హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల విజయలక్ష్మి పదేళ్లుగా కార్డియో సమస్యలతో బాధ పడుతున్నారు. ఆమెకున్న సమస్యతో రక్తాన్ని పంప్ చేసే గుండె క్రమేపీ తన సామర్ధ్యాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో గుండెను మార్చటం మినహా మరో మార్గం లేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ కార్యక్రమైన జీవన్ దాన్ లో పేరు నమోదు చేసుకున్న విజయలక్ష్మి గుండెను ఇచ్చే దాత కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే  తిరుపతికి చెందిన 45 ఏళ్ల చిరంజీవిరెడ్డి స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ తమ ఇంట ఆగిన వెలుగుతో మరో ఇంట వెలుగులు వెలుగుతాయన్న మాటకు సానుకూలంగా స్పందించి.. అవయువ దానానికి చిరంజీవిరెడ్డి కుటుంబం ఒప్పుకుంది. చిరంజీవిరెడ్డి అవయవాలతో నలుగురి ప్రాణాల్ని నిలబెట్టొచ్చంటూ వైద్యుల చెప్పిన మాటకు ఓకే చెప్పింది. దానానికి గుండెసిద్ధంగా ఉండటంతో స్టార్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గోపీచంద్.. వైద్యుల బృందం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లింది. అక్కడ చిరంజీవిరెడ్డి గుండెను వేరు చేసి.. విమానంలో హుటాహుటిన బయలుదేరారు.

పోలీసుల సాయంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేయటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రికి కేవలం 25 నిమిషాల వ్యవధిలో గుండెను చేర్చారు. గుండెను తీసిన నాలుగున్నర గంటలలో శస్తచికిత్స ద్వారా అమర్చాల్సి ఉంటంది. లేనిపక్షంలో అప్పటివరకూ జరిగిన ప్రయత్నం మొత్తం వృథా. మొత్తానికి నిర్దిష్ట సమయంలోపే గుండెను విజయలక్ష్మికి అమర్చారు. అలా ఆంధ్రా గుండె.. తెలంగాణలోని ఒకరి ప్రాణాల్ని నిలిపింది. ఇక.. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన కాలేయం.. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు అమర్చారు. కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. ఒక కిడ్నీని నెల్లూరు.. మరో కిడ్నీని స్విమ్స్ లో చికిత్స పొందుతున్న మరో రోగికి అమర్చారు. మానవత్వంతో తీసుకున్న ఒక నిర్ణయం ఎంతమంది ప్రాణాల్నికాపాడిందో కదూ.

పారికర్.. అమీర్.. రాహుల్.. ఒక వివాదం


రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆ మధ్యన ‘భార్య విదేశాలకు వెళదామంది’  అన్నమాటల్ని పారికర్ తీవ్రంగా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ పేరును నేరుగా ప్రస్తావించని పారికర్.. ఒక బాలీవుడ్ నటుడి మాటలకు దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని.. ఆయన ఎండార్స్ మెంట్ లో ఉన్న బ్రాండ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. చివరకు సదరు కంపెనీ సైతం వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. 

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి గుణంపాఠం చెప్పాలనీ.. తన భార్య దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారని చెప్పటం సిగ్గుచేటు వ్యవహారంగా అభివర్ణించిన పారికర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాడి చేశారు.
పాకిస్థాన్ లాంటి శత్రుదేశాల నుంచి భారత్ ను రక్షించటం రక్షణమంత్రి పారికర్ బాధ్యతే తప్పించి.. స్వదేశీయులను బెదిరించటం కాదంటూ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. పారికర్ వ్యాఖ్యలు ఆర్ ఎస్ ఎస్ పాఠాలు చెప్పినట్లుగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఒక ట్వీట్ తో మండిపడ్డ రాహుల్.. ‘ద్వేషంతో పిరికివాడు విజయం సాధించలేరని వాళ్లు తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. తన మాటలపై విమర్శలు చెలరేగటంతో  పారికర్ స్పందించారు. తాను ‘పాఠం’ నేర్పాలన్న పదం వాడలేదని.. దేశాన్నిప్రేమించే వారు నిశ్శబ్దంగా ఉండకూడదని మాత్రమే తాను చెప్పినట్లుగా వివరణ ఇచ్చారు. పారికర్ లాంటి నిజాయితీ కలిగిన నేతలు  తాము మాట్లాడే మాటల్ని ఆచితూచి ఉపయోగించాలే కానీ ఇష్టం వచ్చినట్లు కాదు. తాము చేసే కీలకవ్యాఖ్యలకు రాజకీయ రంగు అంటే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎలాంటి తప్పు దొర్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో చిన్న పొరపాటు దొర్లినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని పారికర్ లాంటోళ్లు మర్చిపోకూడదు. 

హైదరాబాద్ లో ‘లక్ష’ మందికి మోడీ మాట

తాను వెచ్చించే ప్రతి నిమిషానికి అంతకు వందల రెట్లు ప్రయోజనం కలిగేలా జాగ్రత్తలు తీసుకునే తత్వం ప్రధాని మోడీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తాను వెళ్లే ప్రతిచోటా భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన పాతిక నెలల తర్వాత రాష్ట్రానికి తొలిసారి వస్తున్న మోడీ.. తన పర్యటనకు సంబంధించిన భారీ ప్రయోజనాన్ని పొందాలని భావిస్తున్నారు. అందుకే.. తమ పార్టీ నేతృత్వంలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల ఏడున తెలంగాణ పర్యటనకు రానున్న ఆయన.. తొలుత గజ్వేల్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారని భావించారు. తాజాగా అందుకు భిన్నంగా ఆయన భారీ బహిరంగ సభకు ఓకే చెప్పారు. రాక రాక వస్తున్నప్రధానికి ఘన స్వాగతం పలకటంతో పాటు.. పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ భావించినా.. అలాంటి వాటికి పీఎంవో నో చెప్పేసింది. అయితే.. తన మాట పెద్ద ఎత్తున ప్రజలకు చేరే అవకాశం ఉంటే నో చెప్పేలని మోడీ తీరుకు తగ్గట్లే.. తెలంగాణ బీజేపీ.. ఎల్ బీ స్టేడియంలో ఒక భారీ సభను ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు.

గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మోడీ.. అనంతరం హైదరాబాద్ లోపార్టీ కార్యక్రమంలో పాల్గొనడటం విశేషం. ఎల్ బీ స్టేడియంలో గంట గడిపేందుకు మోడీ ఓకే చెప్పారని.. ఈ గంటలో అరగంటకు తక్కువ కాకుండా మోడీ ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ఈ సభ కోసం భారీ జనసమీకరణ బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తల్ని ఆహ్వానించాలని భావిస్తున్నారు. లక్షకు పైగా జన సమీకరణతో సభను ఏర్పాటు చేయటం ద్వారా తెలంగాణలో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని తర్వాత తన పార్టీ కార్యక్రమంలో భాగంగా భారీ సభలో పాల్గొనటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్తంత చికాకు తెప్పించటం ఖాయమంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? పార్టీ చేపట్టిన భారీ సభలో మోడీ నోటి నుంచి తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారటం ఖాయం.

ఎన్నికల వేళ ‘రేప్’ జరిగితే రియాక్షన్ ఇదీ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పేరు విన్న వెంటనే దారుణమైన నేరాలకు.. ఒళ్లు జలదరించే అత్యాచారాలు ఇట్టే గుర్తుకు వస్తాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను పలువురు గుండా రాజ్యంగా అభివర్ణిస్తారు. దారుణ నేరాలు తరచూ జరిగే ఆ రాష్ట్రంలో తాజాగా ఒక దారుణం చోటు చేసుకుంది. ఇనుపరాడ్ తో కారును అడ్డుకొని.. కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఇప్పుడా రాష్ట్రాన్ని ఊపేస్తుంది. అత్యంత అనాగరికంగా వ్యవహరించిన ఈ ఘటనపై యూపీలోని అఖిలేశ్ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో అఖిలేశ్ సర్కారు ఇలాంటి దారుణాల్నిఎన్నింటినో చూసింది. కానీ.. నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. చోటు చేసుకున్న ఈ సామూహిక అత్యాచారంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల అత్యవసర నెంబరుకు ఫోన్ చేసినా స్పందించకపోవటాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ తీవ్రంగా పరిగణించారు.

ఘటన జరిగిన ప్రాంతంలో భద్రత వ్యవహారాల్ని పర్యవేక్షించే ఎస్ ఎస్ పీ.. నగర ఎస్పీ.. స్థానిక ఏఎస్పీ.. సీఐ.. ఎస్ ఐలు అందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ శివారులోని నొయిడాకు చెందిన కుటుంబం కారులో బులంద్ షహర్ పట్టణ శివారుకు చేరుకున్న సమయంలో ఇనుప రాడ్ ను కారు మీదకు విసరటం.. ఏదో ప్రమాదం జరిగిందని కారు ఆపిన వెంటనే.. ఆగంతుకులు కారు మీద దాడికి పాల్పడి.. కారులోని వారి దగ్గర నుంచి నగదు.. బంగారం తీసుకోవటంతో పాటు.. కారులో ప్రయాణిస్తున్న తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురు వయసు కేవలం పదమూడేళ్లు. 

ఈ ఘటనకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అదుపులోకి తీసుకోవాలంటూ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ నేరుగా ఘటనాస్థలానికి చేరుకొని.. అక్కడే ఉండి.. విచారణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వైనం చూస్తే.. రాష్ట్ర సర్కారు జరిగిన ఉదంతంపై ఎంత సీరియస్ గా ఉందో ఇట్టే తెలుస్తోంది. పోలీసులు తలుచుకుంటే నిందితులు తప్పించుకోవటం అసాధ్యమన్న మాటకు బలం చేకూరేలా జరిగిన దారుణంతో సంబంధం ఉందని భావిస్తున్న పదిహేను మంది పాత నేరస్థులను అరెస్ట్ చేశారు. జరిగిన అత్యాచార కాండలో భావరియా సంచార జాతికి చెందిన వారే బాధ్యులుగా భావిస్తున్నారు. మరోవైపు.. అదుపులోకి తీసుకున్న 15 మందికి జరిగిన నేరంతో ఏ మాత్రం సంబంధం లేదని.. ఇదంతా ప్రభుత్వం ఏదో చేశామన్న భావన కలిగించేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించటంతో పాటు.. రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది.

జగన్ కు కామ్రేడ్స్ తోడయ్యారు

ఏపీ ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై రాజకీయంగా ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. ఏపీకి తీరని అవమానం.. అన్యాయం జరిగిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెలు బాదుకుంటుంటే.. ఇంతకంటే అన్యాయం.. దారుణం ఇంకేం ఉంటుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం జరిగేలా ఉన్న జైట్లీ మాటలపై ఏపీ విపక్ష నేత జగన్.. ఏపీ బంద్ కు పిలుపునివ్వటం తెలిసిందే. 

విపక్షం ఇచ్చిన బంద్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టటమే కాదు.. బంద్ అంటే నిరసనలు కాదని.. ఉత్పత్తిని పెంచాలని.. రోడ్లు ఊడవాలని.. మురికి కాల్వల్ని శుభ్రం చేసి కేంద్రం మీద తమ నిరసనను వ్యక్తం చేయాలని.. చేతికి నల్లబ్యాడ్జిలు కట్టుకోవాలంటూ చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంద్ చేయటం ఏ మాత్రం సమంజసం కాదన్నది చంద్రబాబు మాట.

అయితే.. ఇదంతా రాజకీయంగా వచ్చే మైలేజీని అడ్డుకోవటం కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు కారణంగానే ఏపీకి ప్రత్యేకహోదా రావటం లేదన్నది జగన్ పార్టీ నేతల వాదన. తాము పిలుపునిచ్చిన బంద్ ను పెద్ద ఎత్తున చేపట్టి తమ సత్తా చాటటంతో పాటు.. ఏపీ సర్కారుపై భావోద్వేగ వ్యతిరేకతను పెంచాలన్నది జగన్ టీం ఆలోచనగా చెప్పొచ్చు. ఇలా ఎవరికి వారుగా అధికార.. విపక్షాలు తమ తమ పొలిటికల్ మైలేజీ కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంటున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే ఈ ఆటలో.. కమ్యూనిస్టులు తమ భాగం కోసం పావులు కదిపారు. విభజన సమయంలో విభజనకు అనుకూలంగా వ్యవహరించిన సీపీఐ.. విభజనను వ్యతిరేకించిన సీపీఎం పార్టీలు ఏపీ తరఫున ఒక్కమాట అంటే ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విభజన సమయంలో కమ్యూనిస్టుల వ్యవహారశైలిపై విసిగిన ఆంధ్రులు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ కు వేసిన శిక్ష వేయటంతో పాటు.. ఆ పార్టీకి గతంలో ఉన్న ఛరిష్మా పూర్తిగా తగ్గిపోయిన దుస్థితి. దీంతో..ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా చక్కటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కమ్యూనిస్టులకు తాజా పరిణామాలు కలిసి వచ్చినట్లుగా మారాయి. అందుకే.. జగన్ పార్టీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు తోడుగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునివ్వటం గమనార్హం. కామ్రేడ్స్ తాజా నిర్ణయంతో జగన్ కు కమ్యూనిస్టులు తోడయ్యారని చెప్పాలి

దూసుకెళ్తున్న హరీష్

తెలంగాణ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు యవ్వారాన్ని ఒక చూపు చూసేందుకు.. ఈ ఇష్యూను క్లోజ్ చేసేందుకు తన జపాన్ పర్యటనను సైతం వాయిదా వేసుకున్న మంత్రి హరీశ్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. గడిచిన పాతిక నెలల్లో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితులు మల్లన్నసాగర్ ఇష్యూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించటం.. ముంపునకు గురయ్యే తమ భూముల్ని ఇచ్చేందుకు ఏ మాత్రం సిద్ధం కాకపోవటంతో.. దీన్ని రాజకీయాంశంగా మలచటంలో విపక్షాలు కొంతమేర విజయం సాధించిన విషయం తెలిసిందే.

మల్లన్నసాగర్ ఇష్యూలో విపక్షాలన్నీ ఏకమైన తెలంగాణ సర్కారుకు షాకిస్తున్న వేళ.. ఈ వివాదానికి తెర దించేందుకు మంత్రి హరీశ్ స్వయంగా నడుం బిగించారు. తమ భూములకు తగిన పరిహారం ఇచ్చే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గ్రామాల వారితో వేర్వేరుగా భేటీ అయి.. వారి సమస్యల్ని అసాంతం విని.. వారి మనసుకు నచ్చేలా నిర్ణయాల్ని వెలువరించేందుకు హరీశ్ ప్రత్యేక కసరత్తు చేశారు. అదే సమయంలో.. ముంపు గ్రామాల్లో పర్యటించటం ద్వారా నిరసల్ని మరింత రాజేసేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాల్ని అరెస్ట్ లతో అడ్డుకొన్న తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు బాధితుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

ఇంతకాలం ఎనిమిది ముంపు గ్రామాల్లో ఆరు గ్రామాల్ని ఒప్పించిన మంత్రి హరీశ్..తాజాగా మరో ఊరును ఒప్పించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని తీసుకోవటంతో పాటు.. ముంపునకు గురయ్యే గ్రామాన్ని తిరిగి అదే పేరుతో వేరుగా కట్టిస్తామన్న హామీతో ఇష్యూ పరిష్కారమైంది. తాజా ఒప్పుకున్న సింగారం గ్రామస్తులతో..ఇక వేములఘాట్ ఒక్కటే మిగిలింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములుసేకరించాల్సిన ఎనిమిది గ్రామాల్లో ఏడు గ్రామాలకు చెందిన వారు ఓకే అనటంతో వేముల ఘాట్ ను ఒప్పిస్తే మల్లన్నసాగర్ మీద రచ్చ ముగిసినట్లే. తాజా పరిణామం హరీశ్ కు మరింత ఉత్సాహానిస్తుందనటంతో సందేహం లేదు.