shorte links

Wednesday, March 16, 2016

నమ్మాల్సింది నాన్ననా.. నిజాల్నా?

నమ్మాల్సింది నాన్ననా.. నిజాల్నా? 
ప్ర: నాకిప్పుడు ముప్ఫై మూడేళ్లు. నేను దేశ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్నా. ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. మాది సంపన్న కుటుంబం. నాకు కాబోయే భర్త స్థాయికి తగ్గట్టు ఉండాలని నాన్న చాలా సంబంధాలు చూశారు. ఈ మధ్య ఓ అబ్బాయి నచ్చడంతో నిశ్చితార్థం చేశారు. పెళ్లికి ఇంకా సమయం ఉంది. ఈలోపు మా ఫోటోలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో స్నేహితులతో పంచుకున్నప్పుడు ఒకరిద్దరు.. అతని గురించి ప్రతికూలంగా చెప్పారు. మొదట నేను నమ్మక పోయినా ఎందుకైనా మంచిదని ఆరా తీశా. వ్యసనాలూ, అక్రమ సంబంధాలతోపాటూ, అప్పులూ ఉన్నట్టు తేలింది. అదే విషయాన్ని ఇంట్లో చెబితే నాన్న నమ్మకపోగా.. అసలు పట్టించుకోవట్లేదు. ‘చాలా ఏళ్లకు మంచి సంబంధం దొరికింది. లేనిపోని ఆరోపణలు నమ్మి పెళ్లి వద్దనడం సరికాదు’ అంటున్నారు. ఇంత జరిగాక ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. అలాగని ఆప లేకపోతున్నా. ఏదైనా సలహా ఇవ్వండి.
- ఓ సోదరి
జ:ఉన్నత చదువు కోసం దేశవిదేశాలు చుట్టొచ్చిన మీకు భిన్న వ్యక్తులూ, మనస్తత్వాలూ, సంస్కృతుల పరిచయం కొత్త కాదు. ఈ నేపథ్యంలో అలవాట్లూ, పోకడలనీ గమనించే ఉంటారు. అలాంటి మీరు సమస్యని ఎదుర్కోవడం పెద్దకష్టమని అనుకోవద్దు. అంతకంటే ముందు మీరు కెరీర్‌లో స్థిరపడాలనీ, మీ కంటూ ఉనికిని ఏర్పరచుకోవాలని ఆరాటపడ్డారు. మరోవైపు మీరు అన్ని రకాలుగా విజయం సాధించడం కోసం నాన్నా తాపత్రయపడ్డారు. అండగానూ నిలిచారు. కానీ వివాహ విషయంలోనే కొన్ని విషయాలు మిమ్మల్ని ముల్లులా గుచ్చుకుంటున్నాయని ఉత్తరం సూచిస్తోంది. సరితూగే సంబంధం అనుకుని పెళ్లి ఖాయం చేశారు. కానీ నమ్మి అతడిని అల్లుడిగా మనస్ఫూర్తిగా స్వీకరించాక.. ఆరోపణల్ని మీ నాన్న లెక్కచేయట్లేదు. అవి నిజం కావచ్చు.. అని కూడా ఆలోచించలేకపోతున్నారు. పైగా వారు ఇప్పటికే పెళ్లి ఆలస్యమైందన్న ఆదుర్దాలోనూ ఉన్నారనీ అర్థమవుతోంది. ఇప్పటికే వయసు మించిపోయిందనీ...ఇలా, రకరకాల కోణాల్లో ఆలోచిస్తూ అలా మాట్లాడుతున్నారేమో గమనించండి.
ఇన్నాళ్లపాటూ మీరు తీసుకున్న నిర్ణయాలను సమర్థించి ప్రోత్సహించిన వారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోండి. ఒక వేళ మీరు చెప్పింది వాళ్లకి నిరాధారంగా అనిపించిందేమో అడిగి చూడండి.
ఇది అమ్మానాన్నలు తెచ్చిన సంబంధమే అయినా.. అతని విషయంలో చీకటి కోణాలు ఉంటే.. తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు. నిశ్చితార్థమైనంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. కానీ ఈ బంధం పెళ్లిగా పరిణమించకముందే అన్నీ తెలుసుకున్న మీరు స్పష్టంగా, సాక్ష్యాధారాలతో సహా మీ తల్లిదండ్రులకు చెప్పడం మంచిది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న మీకు కీలకమైన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇంకొంత స్థిరత్వం.. దృఢత్వం కావాలి. తల్లిదండ్రుల్ని కాదనలేక మొహమాటంతో చేసుకుంటే.. భవిష్యత్‌లో సమస్యలొస్తే ఎదుర్కోవాల్సింది మీరే. పరస్పరం నమ్మకం, గౌరవం, విశ్వాసం లేని బంధాలు.. బలహీనమైన పునాదులతో నిర్మించిన ఇళ్ల వంటివి. అలాంటివి ఏ మాత్రం నిలబడతాయో మీరే ఆలోచించుకోండి. ఇక నాన్న నమ్మకం గురించి కూడా ఆలోచించండి. ఇద్దరి వాదనల్లో ఏది నిజమో మీరు తప్పక తెలుసుకోవాలి. నిజమో, భ్రమో అన్న వూహల్ని పక్కన పెట్టి.. వాస్తవికంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి విషయాల్లో స్పష్టత వచ్చాకే నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇకపోతే ఈ రోజుల్లో ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటున్న ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. ఈనేపథ్యంలో మీకు తగ్గ వ్యక్తి దొరుకుతాడేమో ప్రయత్నించడంలో తప్పులేదు. పొసగకుండా.. వైవాహిక బంధంలో అడుగుపెట్టి.. విడాకుల వరకూ వెళ్లడం సరికాదు. ఇది మిమ్మల్నీ, మీ తల్లిదండ్రుల్ని మరింతగా బాధ పెడుతుంది. అదే విషయాన్ని వారితో చెప్పి.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి నిర్ణయాలు తీసుకోండి.

No comments:

Post a Comment